AP News | శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తిరుమలకు కాలినడకన వస్తానని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం పట్ల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. పాప పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి చెంపలు వేసుకుని.. తిరుపతి లడ్డూ వాసన చూసి.. వదిలేయకుండా నిండు విశ్వాసంతో తినాలని వైఎస్ జగన్కు సూచించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామకృష్ణం రాజు మాట్లాడారు. క్రైస్తవుడు అయిన జగన్మోహన్రెడ్డి మెట్లు ఎక్కి కాలినడకన తిరుపతి వెళ్లేందుకు సిద్ధమయ్యారని అన్నారు. జగన్ ఒక క్రైస్తవుడు అని అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. అన్య మతస్థులు ఎవరైనా తిరుపతి వెళ్లాలంటూ రూల్స్ ఫాలో అవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకే హిందూమతం పట్ల అమితమైన విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. పాప పరిహారార్థం జగన్ మోహన్ రెడ్డి చెంపలు వేసుకుని తిరుపతి లడ్డూను వాసన చూసి వదిలేయకుండా నిండు విశ్వాసంతో తినాలని సూచించారు.
శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో పాప పరిహారార్థం తప్పు చేసిన జగన్ను స్వామివారే తిరుపతికి పిలిచినందుకు సంతోషిస్తున్నానని రఘురామ రాజు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి లడ్డూను స్వచ్ఛమైన నేతితో చాలా అద్భుతంగా తయారు చేశారని కితాబిచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై భక్తులు ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల్లో ఎటువంటి దోషాలు జరగకుండా, హిందువుల మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.