తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం నరిశింగాపురం సమీపంలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ (Ambulance ) దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బాధితులంతా పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అంబులెన్స్ మదనపల్లి నుంచి తిరుపతి రుయా దవాఖానకు రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.