Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సజీవదహనమయ్యారు. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందని గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి మరణించారు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
దీపావళి పండుగ కోసం ఇటీవల అనూష రెడ్డి స్వగ్రామానికి వచ్చింది. పండుగ అనంతరం గురువారం రాత్రి అనూష రెడ్డి హైదరాబాద్‌కు బయల్దేరింది. ఖైరతాబాద్‌లో ఆమె వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కింది. ఇక ధాత్రి దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని తన మేనమామ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి బస్సు ఎక్కారు. ఈ బస్సు కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురై మంటలు చెలరేగడంతో ఇద్దరూ బస్సులోనే సజీవ దహనం అయ్యారు. కాగా, ఈ బస్సులో ఎక్కిన ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. వారి మొబైల్స్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు సమాచారం.