TTD | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు సులభంగా లడ్డూలు పొందేలా వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం లడ్డూ విక్రయ కేంద్రంలోని ప్రతి కౌంటర్ వద్ద యూపీఐ పేమెంట్‌కు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది.
ప్రతి ఏటా తిరుమలలో లడ్డూల విక్రయం భారీగా పెరుగుతుంది. అయితే కౌంటర్ వద్ద భక్తులు డబ్బులు చెల్లించడం ద్వారా మాత్రమే లడ్డూలు పొందుతున్నారు. గతేడాది కియోస్క్ యంత్రాలను టీటీడీ తీసుకొచ్చినప్పటికీ అవి మెరుగైన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. కియోస్క్ యంత్రాల వద్ద రద్దీ ఎక్కువ ఉండటం, మెషిన్లలో సాంకేతిక కారణాలు ఇతరత్రా కారణాల వల్ల సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దీంతో లడ్డూలకు సరిపడా చిల్లర తీసుకొని కౌంటర్ వద్దకు రావడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అన్నింటా యూపీఐ పేమెంట్లు ఉండటంతో నగదు కూడా చేతిలో ఎక్కువగా ఉండటం లేదు. ఈ క్రమంలోనే లడ్డూ కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేస్తే.. యూపీఐ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చని టీటీడీ యోచిస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని కౌంటర్లలోనే ఈ విధానాన్ని అమలు చేసి, వచ్చిన ఫలితాలను బట్టి అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.