హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తిరుమలలో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఉగాదితో పాటు వరుస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వెళ్తున్నారు. కాగా, వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో టీటీ డీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సాధారణ భక్తులకు ప్రాధాన్యమిస్తూ వీఐపీ దర్శనాలను కుదించాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం బ్రేక్ దర్శనాల కారణంగా సాధారణ భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తున్నది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, స్థానిక అధికారులు, చిన్నచిన్న ప్రభుత్వ సంస్థల సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనా న్ని రద్దు చేయనున్నట్టు సమాచా రం. స్వయంగా వచ్చే అధికారులకు మాత్ర మే దర్శనం అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి టీటీడీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్నది.
ఒకేసారి రద్దు చేయకుండా ముందస్తు సమాచారం ఇచ్చి క్రమంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, శనివారం శ్రీవారిని 76 వేల మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.3.80 కోట్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతున్నది.