తిరుమల : తిరుమలలోని శ్రీవారి చెంత భక్తుల రద్దీ పెరుగుతుంది. నిన్న స్వామివారిని 62,956 మంది భక్తులు దర్శించుకోగా , 32, 837 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న వివిధ కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఉదయం 6 నుంచి 5 గంటల పాటు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.