తిరుమల: శ్రీవాణి ట్రస్టు ద్వారా వస్తున్న విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతను పాటిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు. ట్రస్టును ప్రారంభించిన తరువాత దళారీ వ్యవస్థను రూపుమాపామని చెప్పారు. మొదటి ఆరు నెలల్లోనే ప్రక్షాళణ చేపట్టామని, ఇప్పటివరకు 70 మంది దళారులను అరెస్ట్ చేశామని, 214 కేసులు నమోదు చేశామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై (Srivani Trust Funds) టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019 సెప్టెంబర్ 23 నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు సమర్పించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. అప్పటి నుంచి ట్రస్ట్‌కు భక్తుల నుంచి భారీ స్పందన లభిస్తున్నదని తెలిపారు. ఇప్పటివరకు 8.24 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా 2023, మే 31 వరకు రూ.861 కోట్ల నిధులు వచ్చాయన్నారు. వివిధ బ్యాంకుల్లో 602.60 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. ఎస్బీ ఖాతా కింద రోజువారీ వచ్చే డబ్బు రూ.139 కోట్లు బ్యాంకుల్లో ఉందని, డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.36.50 కోట్లు వచ్చాయని తెలిపారు. దేవాలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటిదాకా రూ.120.24 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ.139 కోట్లు కేటాయించామన్నారు. భజన మందిరాలు, ఎస్సీ, గిరిజన ప్రాంతాల్లో 2273 ఆలయాలను నిర్మించనున్నామని, దీనికోసం రూ.227.30 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.
శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు. రూ.500, రూ.300లకు భక్తులకు రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రతీ ఒక్క భక్తుడికి రసీదులు ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 8 లక్షల మందికిపైగా భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామి వారిని దర్శించుకోగా.. ఎవరు టీటీడీపై ఆరోపణలు చెయ్యలేదన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళితే రసీదులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీటీడీపై ఆరోపణలు చేశారన్నారు. ఆయన ఎప్పుడు దర్శనానికి వచ్చారో చెబితే పరిశీలించి రసీదులు ఇస్తామన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆరోపణలు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.