అమరావతి : ఏపీలోని అటవీ సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతుంది. ఏనుగుల దాడిని (Elephant attack) అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉండడంతో రైతులు, గ్రామస్థులు బలి అవుతున్నారు. శేషాచలం అడవులు ( Seshachalam Forests), కౌండిన్య అభయారణ్యంతో పాటు చిత్తూరు జిల్లాకు ఇరువైపులా ఉన్న తమిళనాడు కర్ణాటక అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న ఏనుగులు పంట నష్టం, ప్రాణ నష్టాన్ని మిగుల్చుతున్నాయి.
చిత్తూరు జిల్లా పీలేరు మండలం చిన్నగాండ్లపల్లి ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఏనుగులు గుంపు మామిడి తోటకు కాపలాగా ఉన్న రైతు చిన్న రాజారెడ్డి పై దాడి చేశాయి. ఏనుగుల దాడిలో చిన్న రాజారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏనుగుల దాడికి గురై మృతి చెందిన చిన్న రాజారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (MLA Kishore kumar reddy) పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన భరోసానిచ్చారు.