Kakinada | సంక్రాంతి వేళ తీవ్ర విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లెలో ఊరుఊరంతా భస్మమైంది. ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా 38 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో 120 మంది గ్రామస్తులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుండటంతో సరుకులు కొనుగోళ్ల కోసం సోమవారం సాయంత్రం గ్రామస్తులంతా తుని పట్టణానికి వెళ్లారు. ఇంతలోనే గుడిసెల్లో మంటలు చెలరేగాయి. అన్ని తాటాకుతో నిర్మించిన పూరిళ్లు కావడంతో ఒక ఇంటికి అంటుకున్న మంట.. మరో ఇంటికి దావానలం వ్యాపించింది. అగ్ని ప్రమాదం గురించి తెలియగానే తునికి వెళ్లిన గ్రామస్తులంతా హడావుడిగా బయల్దేరి తండాకు వచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అన్ని గుడిసెలకు మంటలు అంటుకుని ఎగిసిపడుతుండటంతో మంటలను ఆర్పడం కాదు కదా.. దగ్గరకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కళ్ల ముందే ఊరు ఊరంతా భస్మం కావడంతో గ్రామస్తులంతా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.