అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ ఈనెల 25న ద్విచక్రవాహనాలతో సీఎంవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో ముడిపడి ఉన్న సీపీఎస్ రద్దుపై అధికారులు ఈ నెల 24లోపు ముఖ్యమంత్రితోనే ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ తమ మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని పేర్కొన్నారని అయితే ఇప్పటి వరకు హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని తెలిపారు. అధికారుల లెక్కలే తప్ప సీపీఎస్‌పై సమావేశాల్లో నిర్ణయాలు ఉండవని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ నెరవేర లేదని పేర్కొన్నారు.
ఉద్యోగులను మానసికంగా వేధింపులకు గురికాకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీలు నేటికి నెరవేర లేదని తెలిపారు.