Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామి వారి హుండీ కిందపడిపోయింది. ఆలయం నుంచి రోజువారీ హుండీలను పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా హుండీ కిందపడటంతో అందులోని కానుకలు కిందపడిపోయాయి. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది వెంటనే మహాద్వారం వద్ద దర్శనానికి వెళ్లే భక్తులను నిలిపివేసి.. కానుకలను తిరిగి హుండీలో వేశారు. అనంతరం హుండీని ట్రాలీలో నుంచి లారీలో ఎక్కించారు. అక్కడి నుంచి హుండీని జాగ్రత్తగా పరకామణికి తరలించారు.
శ్రీవారి హుండీని నిత్యం ఆలయ సమీపంలో కొత్తగా నిర్మించిన పరకామణికి తరలించి.. అక్కడే లెక్కింపు చేపడతారు. నిత్యం ఈ విధానం కొనసాగుతోంది. అయితే ఇవాళ హుండీ కిందపడిపోయిన ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే హుండీ కిందపడిపోవడానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అనుమానిస్తున్నారు.