హైదరాబాద్ : ఏపీలోని నంద్యాల జిల్లాలో(Nandyala district) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్(ARBCVR) బస్సు టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ మీదుగా దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి, ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్ భాస్కర్ మృతి చెందాడు. లారీలోని డ్రైవర్, క్లీనర్లు క్యాబిన్లో చిక్కుకుపోయి సజీవ దహనం అయ్యారు. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
కాగా, సకాలంలో స్పందించిన స్థానికులు ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు తరలించారు. సంఘటన స్థలాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, వరుసుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డు ప్రమాద నివారణకు సరైన చేపట్టాలని కోరుతున్నారు.