AP News | పాపం.. అదే తన చివరి పుట్టిన రోజు అవుతుందని ఆ బాలిక అనుకోలేదేమో ! బర్త్ డే అని అప్పటిదాకా సంతోషంగా ఆడిపాడిన బాలికను విధి కబలించింది. బర్త్ డే పార్టీ చేసుకుని కొద్ది గంటలు అయినా అయ్యిందో లేదో అప్పుడే పైలోకానికి వెళ్లిపోయింది. భవనం కుప్పకూలడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో బాలికతో పాటు ఆమె సోదరుడు, మరో వ్యక్తి సజీవ సమాధి అయ్యారు. విశాఖపట్నంలోని రామజోగిపేటలో విషాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నానికి చెందిన సాకేటి రామారావు, కల్యాణి దంపతులు రామజోగిపేటలోని ఓ మూడంతస్తుల భవనంలో ఉంటున్నారు. వారికి ఇద్దరు సంతానం.. అంజలి (14), దుర్గాప్రసాద్ (17). నిన్ననే అంజలి పుట్టినరోజు. దీంతో బుధవారం పార్టీ చేసుకుని కుటుంబసభ్యులంతా సరదాగా గడిపారు. అర్ధరాత్రి అవ్వడంతో అలా కునుకు తీశారో, లేదో ఇంతలోనే పెద్ద శబ్ధం. ఒక్కసారిగా వారు ఉంటున్న మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పడి అంజలి, దుర్గా ప్రసాద్ ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరితో పాటు బిహార్‌కు చెందిన మరో యువకుడు (27) కూడా సజీవ సమాధి అయ్యాడు. సాకేటి రామారావు, కల్యాణి దంపతులతో పాటు భవనంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడవడం వల్లే బిల్డింగ్ కూలిందని అధికారులు వెల్లడించారు.