అమరావతి : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతామని, ఆ తప్పు చేయవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan ) రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన మేమంతా సిద్ధం ఎన్నిక ల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలు చంద్రబాబు(Chandra Babu) కు ఇవే చివరి ఎన్నికలు కావాలని అన్నారు. నారావారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
ఏపీలో జగన్ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమయ్యారని దుయ్యబట్టారు. తమ హయాంలో మూడు రాజధానిలు మొదలు, కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 14 సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు ఏ ఒక్క మంచి స్కీం చేపట్టలేదని విమర్శించారు. చంద్రబాబు అంటే వెన్నుపోట్లు , బషీర్బాగ్లో రైతులపై కాల్పులు, వ్యవసాయం దండుగ అని గుర్తు కొస్తాయని, బాబు వస్తే కరువు వస్తుందని గుర్తుకొస్తుందని పేర్కొన్నారు.
50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు ఇస్తున్నామని తెలిపారు. 2014లో ఇచ్చిన హామీ బాబు పాలనలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని, మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేసే నాయకులు అవసరమా అంటూ ప్రజలను కోరారు. తాము 99 శాతం హామీలు అమలు చేశామని అన్నారు.