హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ప్రభుత్వ విభాగాల సిఫారసు లేఖలను టీటీడీ తిరస్కరిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై టీటీడీ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు కుటుంబసమేతంగా సిఫారసు లేఖలతో వచ్చి.. తీరా లేఖలు స్వీకరించడం లేదని తెలిసి ఇబ్బందిపడుతున్నారు.
భక్తుల రద్దీ కారణంగా ఏటా ఏప్రిల్ మూడునెలలపాటు సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే వీఐపీ ప్రొటోకాల్ భక్తులకు మాత్రమే బ్రేక్ ఈ క్రమంలోనే సిఫారసు లేఖలు తిరసరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు అధికారిక సమాచారాన్ని విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతున్నది. శనివారం శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.