PM Modi | ఏపీ ప్రజల ప్రేమ, అభిమానానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అంతకు ముందు సిరిపురం సెంటర్ నుంచి కాలేజీ వరకు ఏపీ సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు, నక్కలపల్లిలో బల్క్‌డ్రగ్ పార్కుకు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్‌కు శంకుస్థాపనలు చేశారు. అలాగే, గుంటూరు-బీబీనగర్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు, గుత్తి-పెండేకల్లు రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేసి.. చిలకలూరిపేటలో ఆరు లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేశారు. అలాగే, ఏపీలోని 17 రోడ్డు ప్రాజెక్టులకు, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. క్రిస్ సిటీతో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. తెలుగులోనే ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి నమస్కరిస్తున్నానన్నారు. 60 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మేం మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు. ప్రజల స్వాగతం, ఆశీర్వాదం చూశానన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామన్నారు. చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేం అండగా ఉంటామన్నారు. అన్నిరంగాల్లో రాష్ట్రంలో మద్దతునిస్తున్నామని.. 2047 నాటికి రెండున్నర ట్రిలియన్ డాలర్ల లక్ష్యం పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంతో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడుతాయన్నారు. ఐటీ, టెక్నాలజీకి ఈ రాష్ట్రం ప్రధాన కేంద్రం కానుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. 2030లో ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ మా లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే.. దాంట్లో ఒకటి విశాఖకు కేటాయించామని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతోమందికి ఉపాధి వస్తుందన్నారు. నక్కలపల్లి బల్క్‌డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశామని, మూడు రాష్ట్రాల్లోనే ఇలాంటి బల్క్ డ్రగ్ పార్కులు వస్తున్నాయన్నారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్ సిటీ భాగం అవుతుందన్నారు.
ఇప్పటికే ఈ సిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుందన్నారు. దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు పునాదిరాయి వేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వేజోన్ కీలకం కానుందన్నారు. రైల్వేజోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందన్నారు. రైల్వేజోన్ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. అమృత్ భారత్ కింద ఏపీలోని 70కిపైగా రైల్వేస్టేషన్లు ఆధునికీకరణ జరుగుతున్నాయని.. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. విశాఖతీరం, వందల ఏళ్లుగా ఎగుమతులు, దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని తెలిపారు. విశాఖలోని హార్బర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల ఆదాయం పెరిగేలా నిబద్ధతతో పని చేస్తున్నామన్నారు.