Tirumala | తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు ఏకంగా కొండపైకి పెద్ద గిన్నె నిండుగా ఎగ్ పులావ్ తీసుకొని వచ్చారు. రాంభగీచ బస్టాండ్ సమీపంలో వారు గుడ్లు తినడం చూసిన ఇతర భక్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఓ డబ్బా నిండా కోడి గుడ్లు, పులావ్ తీసుకుని తిరుపతికి వచ్చారు. అలిపిరి నుంచి తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో సెక్యూరిటీ తనిఖీని దాటుకుని వాళ్లు ఎగ్ పులావ్‌ను రాంభగీచ బస్టాండ్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఓ పక్కన కూర్చొని కోడిగుడ్లు, పులావ్ తింటుండటం గమనించిన ఇతర భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం నిషిద్ధం అని వారికి తెలిపారు. అయితే తమకు ఆ విషయం తెలియదని తమిళనాడు భక్తులు చెప్పడంతో.. పోలీసులు మందలించి వదిలేశారు.
అయితే, తిరుమలపైకి వచ్చేప్పుడు ఉండే పకడ్బందీ సెక్యూరిటీ తనిఖీని దాటుకుని భక్తులు కోడిగుడ్లను కొండపైకి తీసుకురావడం ఇప్పుడు కలకలం రేపుతుంది. దీంతో తిరుమలలో భద్రతలో డొల్లతనంపై పలు అనుమానాలు వస్తున్నాయి.
Read More :
Viral News | 68 ఏళ్ల బామ్మతో 64 ఏళ్ల తాత పెళ్లి.. ఏపీలో అరుదైన వివాహం
Madhavilatha | క్షమాపణ చెబితే సరిపోదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన మాధవీలత