Nara Lokesh | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఓ కొత్త డిమాండ్ హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ల నుంచి కొద్దిరోజులగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు కొంతకాలంగా ఈ డిమాండ్ వినిపిస్తుండగా.. తాజాగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ వర్దంతి సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ఏకంగా తన కోరికను చంద్రబాబు ముందు ఉంచారు. నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి ఏపీ కేబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నంబర్ టూ పొజిషన్లో ఉన్నారు. అధికారికంగా ఎక్కడికి వెళ్లినా పవన్ కల్యాణ్‌కే ప్రాధాన్యత దక్కుతున్నది. దీంతో పవన్ కల్యాణ్ కంటే ఒక మెట్టుపైనే ఉండాలని లోకేశ్ ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. అది కాకుండా తన తర్వాత తన కొడుకునే నంబర్ టూ పొజిషన్లో చూడాలని చంద్రబాబు కూడా అనుకుంటున్నట్లు సమాచారం. కానీ పవన్ కల్యాణ్ మాత్రం కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పేరుకు కూటమిలో ఉన్నప్పటికీ ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. తప్పు చేసింది కూటమి నేతలైనా సరే నిలదీస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని.. దీన్ని చక్కబెట్టేందుకు అవసరమైతే హోం శాఖను తానే తీసుకుంటానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు సంబంధించిన క్యూలైన్లలో తొక్కిసలాట జరిగిన ఘటనలోనూ పవన్ కల్యాణ్ దూకుడుగా స్పందించారు. టీటీడీ ఈవో, చైర్మన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు, లోకేశ్ సహా తెలుగు తమ్ముళ్లకు మింగుపడటం లేదు.
కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ఇప్పటికే కీలకంగా మారిపోయారు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత నంబర్ టూ ఎవరంటే పవన్ కల్యాణ్ పేరే వినిపిస్తుంది. పైగా క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు లోకేశ్ కంటే కూడా ఎక్కువగా పవన్ కల్యాణ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కేడర్ ఓ రేంజ్లో బలపడిపోతుంది. ఇది లోకేశ్ రాజకీయ ఎదుగుదలతో పాటు టీడీపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చంద్రబాబుతో సహా తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలా అని పవన్ కల్యాణ్‌ను హోదాను తగ్గించే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్‌పై ఎంత కోపం వచ్చినప్పటికీ పొత్తు కారణంగా వాళ్లు ఏమీ అనలేకపోతున్నారు. పైగా బీజేపీ , ప్రధాని మోదీతో చంద్రబాబు కంటే పవన్ కల్యాణ్‌కే ఎక్కువ సాన్నిహిత్యం ఉంది. దీంతో పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్‌గా టచ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కల్యాణ్‌కు ధీటుగా లోకేశ్‌కు సమాన హోదా ఇస్తే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం వల్ల పవన్ కల్యాణ్ క్రేజ్‌కు క్షేత్రస్థాయిలో కొంచెంలో కొంచెమైనా చెక్ పెట్టవచ్చని టీడీపీ నాయకులు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి డిప్యూటీ సీఎం పదవి అనేది చట్టబద్ధం కాదు. ఒకరిద్దరికే పదవి ఇవ్వాలని కూడా లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కేబినెట్లో ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు హయాంలో కూడా ఒకరికంటే ఎక్కువ మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కల్యాణ్ ఒక్కడే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. కాబట్టి నారా లోకేశ్‌కు కూడా డిప్యూటీ సీఎం ఇస్తే వచ్చే నష్టమేమీ లేదు. అందుకే తెలుగు తమ్ముళ్ల నుంచి ఈ వాదనను బలంగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు నుంచి టీడీపీ నాయకుల నుంచి ఈ వాదన వినిపించగా.. తాజాగా వైఎస్ఆర్ జిల్లాలో కూడా టీడీపీ నేతల నుంచి ఈ వాదనను తీసుకొచ్చారని అనుకుంటున్నాయి. మరి నిజంగా పవన్ కల్యాణ్‌కు కాంపిటీషన్‌గా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారో లేదో చూడాలి.
Madhavilatha | క్షమాపణ చెబితే సరిపోదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన మాధవీలత
Srinivas Goud | మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శ్రీనివాస్ గౌడ్ సవాలు