Srinivas Goud | కాంగ్రెస్ నేతలను కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణకు సాగునీటి రంగం విషయంలో చేసిన పాపాలు తవ్వితే పుట్టల నుంచి పాములు వచ్చినట్టు వస్తాయని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బ్రిజేష్ ట్రిబ్యునల్ తాజా మధ్యంతర ఉత్తర్వులు ముమ్మాటికీ కేసీఆర్ ఘనతే అని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలోనే మహబూబ్‌నగర్ అభివృద్ధి జరిగిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ ఏ పనిచేయలేదని అనే మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాలు విసిరారు.
విభజన చట్టం సెక్షన్ 89 కాంగ్రెస్ తెచ్చింది కాదా.. దాని ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి కేసీఆర్ ఒప్పుకుంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులు వచ్చేవా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే సెక్షన్ 3 ప్రకారం నీళ్ల పంపిణీ జరగాలని కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కేసీఆర్‌ను ఇంకా విమర్శిస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని ఆయన కొనియాడారు.
కేసీఆర్ హయాంలో పాలమూరులోని పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకసారి రికార్డులను తెప్పించుకోవాలని సూచించారు. పాలమూరు నుంచి వలసలు తగ్గించింది కేసీఆర్ కాదా ని ప్రశ్నించారు. పాలమూరు వెనకబడటానికి ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్‌దే పాపం అని ఆయన విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపడానికి కుట్రదారులు ఎవరో ముందు ఉత్తమ్ కనిపెట్టాలని అన్నారు.
పెట్టిన మోటార్లు, కట్టిన రిజర్వాయర్లు, తవ్విన కాలువలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మోటార్లు స్విచ్ ఆన్ చేసి నీళ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేమిటి అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ మంట గలిపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. లక్ష కోట్లు కేటాయించి అయినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. ముందు ఆ పని చేయాలని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుల పై కాంగ్రెస్ నేతలు ముందు రాజకీయాలు మానాలని హితవుపలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టు పనైనా ముందుకు సాగిందా అని నిలదీశారు. పాలమూరు కడుపుగొట్టి వేరే ప్రాంతాలకు నీళ్లు ఇస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు.
కర్ణాటక ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తమ మీద విమర్శలు చేయడం మాని ప్రాజెక్టులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హితవు పలికారు. నదీజలాలపై తమిళ నాడు రాజకీయ పార్టీలు ఏక తాటి పై ఉన్నట్టే తెలంగాణలో పార్టీ లు ఒక్కటై పోరాడాలని అన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని ప్రధాని మోదీ ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఆ హామీపై మౌనంగా ఉన్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం బీజేపీ నేతలు మోదీ దగ్గరకు అఖిల పక్షాన్ని తీసుకెళితే తాము కూడా వస్తామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలోనే మహబూబ్‌నగర్ అభివృద్ధి జరిగిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో మహబూబ్ నగర్ అభివృద్ధికి సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. విమర్శించే వారు వాటిని చూసి మాట్లాడాలని హితవు పలికారు. మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉన్న జూపల్లి ఇవాళ తమ మీద విమర్శలు చేస్తే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీఅని అన్నారు. తెలంగాణ కు బీఆర్ఎస్ చేసిందేమిటో ప్రజల ముందు ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ఏ పనిచేయలేదని అనే మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాలు విసిరారు.