Viral News | ఆ తాతకు 64 ఏళ్లు.. బామ్మకు 68 ఏండ్లు.. వయసైపోయి వృద్ధాశ్రమానికి చేరిన వారిద్దరూ అక్కడే ఇష్టపడ్డారు. ఇద్దరి మనసులు కలవడంతో ఈ లేటు వయసులోనే పెళ్లి చేసుకుని ఒకరికొకరు తీడు నీడగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆశ్రమ నిర్వాహకుడికి చెప్పారు. తోటి వృద్ధుల సమక్షంలో ఆ వృద్ధాశ్రమంలోనే దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఏపీలోని రాజమహేంద్రవరంలో ఈ అరుదైన వివాహం జరిగింది.
రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నారాయణపురానికి చెందిన మడగల మూర్తి (64) రెండేళ్లుగా తలదాచుకుంటున్నాడు. కొంతకాలం క్రితం మూర్తి తీవ్ర పక్షవాతానికి గురయ్యాడు. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప కదల్లేని పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో అదే ఆశ్రమంలో ఉంటున్న వైఎస్ఆర్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ (68) అతనికి అండగా నిలబడింది. రాత్రి పగలు తేడా లేకుండా అన్నీ తానై మూర్తికి సపర్యలు చేసింది. రాములమ్మ సహకారంతో మూర్తి తొందరగానే కోలుకున్నాడు.
ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మూర్తి బుర్రను ఒక ఆలోచన తొలిమేసింది. వయసులో ఉన్నప్పటికంటే కూడా వయసుపైబడిన ఈ వయసులోనే ఒక తోడు అవసరమని అనిపించింది. జంటగా ఉంటే కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలబడవచ్చని భావించాడు. తనను కంటికి రెప్పలా కాపాడిన రాములమ్మను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని రాములమ్మతో చర్చించగా.. ఆమె కూడా ఒప్పుకుంది. దీంతో తన నిర్ణయాన్ని ఆశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో అతని నిర్ణయంతో ఏకీభవించాడు. ఆ వృద్ధ జంటకు శుక్రవారం ఆశ్రమంలోనే పెళ్లి చేశాడు.
Madhavilatha | క్షమాపణ చెబితే సరిపోదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన మాధవీలత