Srisailam | వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీశైల ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్తలన్నింటిని తీసుకోవాలని సూచించారు. ఎక్కడ కూడా చెత్తాచెదారాలు ఉండకుండా విస్తృత పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. క్షేత్రపరిధిలో ఎక్కడ కూడా వర్షం నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా దోమలు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.
మంచినీరు కలుషితం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈవో ఆదేశించారు. శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా నీటిని క్లోరినేషన్ చేస్తుండాలని సూచించారు. క్షేత్ర పరిధిలోని మంచినీటి ట్యాంకులన్నింటినీ క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. మంచినీటి ట్రీట్మెంట్ ప్లాంట్ నందు ప్రతీరోజు కూడా టీడీఎస్ తనిఖీ చేయాలన్నారు. దేవస్థానం వైద్యశాలలో అవసరమైన అన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరాన్నిబట్టి ఆయా మందుల ఇండెంటులను ముందస్తుగానే వైద్యశాల విభాగాధికారికి అందజేయాలని దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో డాక్టర్లను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత, మరిగించి చల్లార్చిన నీటిని తాగడం, ఇళ్ళలోనూ, ఇంటి పరిసరాలను నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త పడడంలాంటి అంశాలపై స్థానికులలో అవగాహన కలిగించాలని దేవస్థాన వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య వైద్యులను సూచించారు. ఈ విషయమై దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా (మైకు ద్వారా) కూడా స్థానికులలో అవగాహన కల్పించనున్నారు. ఇదే విషయంలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్షేత్రపరిధిలో ప్రధాన కూడళ్లు, ఇతర ప్రదేశాలలో తగు బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కరపత్రాల ద్వారా కూడా ప్రచారం కల్పించాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
దేవస్థాన అన్ని విభాగాలు, దేవస్థానం వైద్యశాల సిబ్బంది, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అందరు కూడా సమన్వయంతో విధులు నిర్వర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఈవో ఆదేశించారు. సమాచార వినిమయం కోసం దేవస్థానం సంబంధిత విభాగాల అధికారులు, దేవస్థానం వైద్యశాల వైద్యులు, సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, స్థానిక ఆయుర్వేద వైద్యాధికారి, సిబ్బందికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఐటీ విభాగాన్ని ఆదేశించారు. విధినిర్వహణలో పరస్పర సమన్వయం కోసం ఈ వాట్సాప్ గ్రూపును వినియోగించుకోవచ్చునని అన్నారు.