Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మల్లికార్జున స్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ రథోత్సవాన్ని కనుల పండువలా జరిగింది. ఉదయం అర్చక వేదపండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద్ధజలాలతో స్వామివారిని అభిషేకించి మహా బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు. అదేవిధంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పం, శాంతిమంత్రాలు పఠించారు. అనంతరం స్వర్ణరథంపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను వేంచేరపు చేసి.. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆలయ మహాద్వారం నుంయి నాలుగు మాడవీధుల్లో స్వామి, అమ్మవార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వర్ణరథోత్సవాన్ని ప్రతిమాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున నిర్వహించనున్నట్లు ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల నిత్య పూజాకైంకర్యాలలో వినియోగించేందుకు హుజూర్‌నగర్‌కు చెందిన అద్దంకి నరసింహారావు దంపతులు వెండి వస్తువులను కానుకలుగా సమర్పించారు. 900 గ్రాముల బరువున్న రెండు బిందెలు, 1.665 కేజీల బరువు ఉన్న గంధాక్షరి ఐదుగిన్నెల సెట్‌ను కానుకగా సమర్పించారని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పర్యవేక్షకులు అయ్యన్న, ఆలయ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, గుమస్తా సావిత్రికి అందించగా దాతలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల దర్శనం కల్పించి.. ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.