శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ రథోత్సవం కనులపండువలా నిర్వహించారు. వేదపండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద్ధజలాలతో స్వామివారిని అభిషేకించి మహా బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు. అదేవిధంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పం, శాంతిమంత్రాలు పఠించారు. అనంతరం స్వర్ణరథంపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను వేంచేరపు చేసి.. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వర్ణరథోత్సవం ఆలయ రాజగోపురం నుండి ఆలయం మాడవీధులలోని హరిహరరాయ గోపురం, బ్రహ్మానందరాయ గోపురం, శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా స్వర్ణరథోత్సవం జరిగింది బంగారు స్వర్ణరథోత్సవం ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఈ వేడుకను తిలకించేందుకువందలాదిగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వర్ణ రథోత్సవాన్ని కన్నులారా తిలకించారు.
శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు బంగారు రథంలపై ఊరేగుతుండగా ఆలయ అర్చకులు, వేద పండితులు రథంపై కొలువైన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం జరుగుతుండగా రథం ఎదుట మహిళల కోలాటాలు, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఆకట్టుకున్నారు.