Bhumana Karunakar Reddy | టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదని చెప్పే హక్కు లేదని భూమన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి వద్ద జగన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.
తిరుపతిలో సేవ్ తిరుమల.. సేవ్ టీటీడీ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు స్వామీజీలు డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో తిరుమల పవిత్రతను కాపాడలేదని విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఏనాడైనా ఆయన సతీమణిని శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మన ఇంట్లో పూజ చేస్తేనే పక్కన భార్య ఉండేట్లు చూసుకుంటామని అన్నారు. హిందువుల మనోభావాలు, విశ్వాసాలను జగన్ ఏనాడూ గౌరవించలేదని విమర్శించారు.
డిక్లరేషన్ ఇచ్చేందుకు అభ్యంతరమేంటి?
తిరుమలకు వచ్చినప్పుడు ఏనాడైనా డిక్లరేషన్‌పై జగన్ సంతకం చేశారా అని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఎన్నో పాపాలు జరిగాయని.. ప్రక్షాళన జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఆలయాలు, పూజారులపై దాడులు జరిగినా ఏనాడూ స్పందించలేదని మండిపడ్డారు. జగన్, వైసీపీపై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని ఆయన అన్నారు. ఆలయాల సంప్రదాయాలను గౌరవించకపోవడాన్ని మాత్రమే తప్పుబడుతున్నామని అన్నారు. డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్‌కు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.
జగన్ పర్యటనతో తిరుమల మళ్లీ అపవిత్రమవుతుంది
తిరుమలను శాంతియాగం, ప్రోక్షణతో పవిత్రం చేశారని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. జగన్ పర్యటనతో తిరుమల మళ్లీ అపవిత్రమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడకు వచ్చి మరింత క్షోభకు గురిచేయవద్దని సూచించారు. కోడికత్తి లాంటి నాటకాలను తిరుమల పర్యటనలోనూ ఆడుతారని తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.
డిక్లరేషన్ వెనుక రాజకీయ కుట్ర ఉంది : భూమన
జగన్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమనిహెచ్చరించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని సనాతన ధర్మం చెబుతోందని తెలిపారు. అలాంటిది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పట్టువస్త్రాలు సమర్పించిన జగన్‌ను డిక్లరేషన్ అడగడం దారుణమని విమర్శించారు. జగన్ డిక్లరేషన్‌పై ఇంత రాద్దాంతం జరిగినా చంద్రబాబు మాట్లాడటం లేదని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. డిక్లరేషన్ వెనుక రాజకీయ కుట్ర ఉందని తెలిపారు. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు పాశవిక విధానాలను వ్యతిరేకిస్తూనే ఉంటామని భూమన తెలిపారు. చంద్రబాబు వెయ్యి నాలుకల ధోరణిని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
జగన్ పర్యటనను అడ్డుకోం : కూటమి నేతలు
మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవద్దని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. తిరుపతిలో శుక్రవారం సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు.. జగన్ వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీకి జగనే కారణమని ఈ నిరసన చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఒకవేళ వైసీపీ రాజకీయ బల ప్రదర్శనకు దిగితే మాత్రం దీటుగా సమాధానం చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు.
ఇందిరాగాంధీ కూడా డిక్లరేషన్ ఇచ్చారు : తిరుపతి ఎమ్మెల్యే
గత ప్రభుత్వం తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. జగన్ తిరుమల రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అర్హత జగన్‌కు లేదని తెలిపారు. జగన్ కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ, అబ్దుల్ కలామ్ డిక్లరేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. జగన్ పర్యటనను నిరసిస్తూ ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలుపుతామని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు.