ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్‌కు పోలీస్ స్టేషన్ హోదా లేదని ఏపీ హైకోర్టు పలు కేసులను గంపగుత్తగా కొట్టివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? దర్యాప్తు ఎలా జరుగుతుందో విశ్లేషించకుండా కేసులను కొట్టివేయడం ఏంటని ప్రశ్నించింది. ఈ కేసులకు హైకోర్టు ఉత్తర్వులు అమలు కావని స్పష్టం చేసింది. ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులను ఇలా ఏకపక్షంగా కొట్టివేస్తారా అని ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చారు.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న 11 ఎఫ్ఐఆర్లపై తదుపరి విచారణ కొనసాగించి, చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ పనిచేసిందని, ఆ యూనిట్‌కు రాష్ట్రమంతా జురీడిక్షన్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, గుంటూరు ప్రమోద్లో సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న ఇన్వెస్టిగేటివ్ యూనిట్‌ను విజయవాడకు తరలించారని.. అప్పుడు పోలీస్ స్టేషన్ హోదా గురించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఉన్న అధికారాలే.. విజయవాడకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతాయని తెలిపారు. గతంలో పంజాబ్, బిహార్ రాష్ట్రాల విభజన కేసును సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు. ఈ తీర్పులను పట్టించుకోకుండా హైకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందని పేర్కొంది. ఈ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.