KA Paul | తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేఏ పాల్ వేసిన పిటిషన్పై శుక్రవారం ఉదయం విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేఏ పాల్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తిరుమల దేవాలయాల నిర్వహణ పాలకమండలి చేతిలో కాకుండా పూజారుల చేతుల్లో ఉంచాలని ఆ పిటిషన్లో కేఏ పాల్ కోరారు. కేవలం 744 మంది కేథలిక్లు ఉన్న వాటికణ్ సిటీని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారని.. అలాగే లక్షలాది మంది భక్తులకు ప్రాధాన్యత ఉన్న తిరుపతి కూడా అదేవిధంగా ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల దేవాలయానికి వచ్చే వేల కోట్ల ఆదాయం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, సీబీఐ, డీజీపీలను కేఏ పాల్ ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు.