అమరావతి : ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన టీడీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు(Chandrababu) విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం కేంద్రానికి లేఖ రాశారని, ఆ లేఖలో స్వయంగా ఆయన సంతకం కూడా చేశారని గుర్తు చేశారు. ప్లాంట్ ను రక్షించుకునేందుకు రాజీనామాలకు సైతం సిద్ధమని పేర్కొన్నారని వెల్లడించారు. ప్రస్తుతం మీరే అధికారంలో ఉన్నారు.
ఇచ్చిన మాట మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటారా..? లేక రాజీనామా చేస్తారా..? చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ఆంధ్రా రాష్ట్రానికి తలమానికమని, ప్లాంట్ కు హాని జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధమని ప్రకటించారు.