అమరావతి : ఏపీలో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేవరకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. చేనేత వస్త్రాల(Handloom garments) పై జీఎస్టీ(GST) తొలగించేందుకు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని, లేకపోతే రియింబర్స్‌మెంట్ ఇస్తామని ప్రకటించారు. విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాలలో బుధవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చేనేతలకు గతంలో ఇచ్చిన పథకాలన్నింటినీ వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. చేనేత శాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చి ఆదుకుంటామని పేర్కొన్నారు. టీడీపీ బడుగు, బలహీనవర్గాల పార్టీ అని వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్(BC Sub Plan) కు రూ. లక్షా 50వేల కోట్లు పెట్టామని వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పారు. అట్టడుగు వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా , సామాజికంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. చట్టసభల్లో వెనుకబడిన తరగతుల వారికి 33శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో చట్టం కోసం ప్రయత్నిస్తామని అన్నారు. రాబోయే నామినేటెడ్ పోస్టులోనూ బీసీలకు న్యాయం చేస్తామన్నారు. తమ ప్రభుత్వం స్పీకర్‌గా బీసీకే ఇచ్చామని, మంత్రివర్గంలో బీసీలకే ప్రాధాన్యం కల్పించామని తెలిపారు.
మెగా డీఎస్సీ (Mega DSc) లో 16347 ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని తెలిపారు. ఈనెల 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అన్నదానం చేసే దాతలు అన్న క్యాంటీన్లు ఉపయోగించుకోవాలని సూచించారు. యువత నైపుణ్యం పెంచడానికి స్కిల్ సెంటర్లు ప్రారంభిస్తామని అన్నారు. ప్రయత్నాలతో ఆర్థిక అసమానతలు తొలగించడం సాధ్యమేనని అన్నారు. చేనేత కార్మికుల ఆరోగ్య బీమా కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తానని అన్నారు.