తిరుమల : ఆపదమొక్కుల వాడు కొలువుదీరిన తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఒకరోజు పాటు మూసివేయనున్నారు ( Close ) . మార్చి 3వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు.
చంద్రగహణం ( Lunar eclipse ) కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుందని, సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. . సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం అనంతరం రాత్రి 8:30 గంటల నుంచి శ్రీవారి దర్శనం పునః ప్రారంభవుతుందన్నారు .
ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందన్నారు.
వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేశామని తెలిపారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా సూచించారు.