తిరుమల : చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తిరుమల ( Tirumala ) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలను ( Temple gates ) సాంప్రదాయ బద్ధంగా మూసివేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( Chairman BR Naidu ) చెప్పారు. రాత్రి 9.50 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం ( Lunar eclipse) ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా శుద్ధి తదితర కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఉదయం 3 గంటలకు మళ్లీ శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు వివరించారు. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులందరికీ నిర్దేశిత సమయానికి అనుగుణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాట్లు కల్పించామని వివరించారు.
చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదం కాంప్లెక్స్, వకుళమాత, పిఏసి–2, వైకుంఠం వంటశాలలు మూసి వేసినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాద విభాగం భక్తుల కొరకు 50 వేల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసిందన్నారు. అన్నప్రసాద వితరణ సోమవారం ఉదయం 8 గంటల నుంచి పునః ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ అర్చకులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.