తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజే 61,620 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,988 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.36 కోట్లు వచ్చిందని తెలిపారు.
ఈనెల 7వ తేదీన 57,904 మంది, 8న 58,561 మంది, 9న 59,086 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో అహోబిలం పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారిని జేఈవో వీరబ్రహ్మం, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ ఆహ్వానించారు. మార్చి 29న తిరుమలలో జరుగనున్న వర్ధంతి ఉత్సవాలకు అహోబిలం పీఠాధిపతిని ఆహ్వానించారు.