Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలానికి వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులు నకిలీ వెబ్‌సైట్స్‌ను ఆశ్రయించి మోసపోవద్ది ఈవో శ్రీనివాసరావు సూచించారు. ఇటీవల దేవస్థానం నిర్వహిస్తున్న వసతి సముదాయాల పేరుతో మూడు నకిలీ వెబ్సైట్ కారణంగా పలువురు యాత్రికులు మోసపోయినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలంలో దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు, ఆయా ఆర్జితసేవలను, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని రూపొందించిందన్నారు.
వసతిని, దర్శనం, ఆర్జిత సేవలు, స్పర్శదర్శనం కోసం టికెట్లను భక్తులు దేవస్థానం అధికారిక వెబ్సైట్ srisailadevasthanam.org లేదంటే.. ఏపీ దేవాదాయశాఖకు చెందిన aptemples.ap.gov.in వెబ్‌సైట్స్‌ని మాత్రమే వినియోగించాలని.. ఇతర సైట్స్‌ని నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఆమోదించిన, దేవస్థానం నిర్వహిస్తున్న అధికారిక వెబ్‌సైట్స్‌లో ఖచ్చితమైన సమాచారం ఉంటుందని.. అందులోనే టికెట్లు తీసుకోవలని కోరారు. వసతి గదుల నమోదు, ఆర్జితసేవా టక్కెట్లు, స్పర్శ దర్శనం, శీఘ్ర అతిశీఘ్ర దర్శనం, విరాళాలు అన్నీ అందుబాటులో ఉంటాయని చెపపారు. అవసరమైతే దేవస్థానం కాల్ సెంటర్ 833901351/52/53 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఎవరైనా క్షేత్ర పరిధిలో వసతి గదులు, దర్శనం టికెట్లు ఇప్పిస్తామని దగ్గరకు వచ్చే దళారులపై ఫిర్యాదు చేయాలని కోరారు.