Srisailam Temple | శ్రీశైలం : శ్రీగిరులపై సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు జరిగే బ్రహోత్సవాల్లో రెండోరోజు ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష నిర్వహించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ వేదపండితులు, అర్చకులు యాగశాలలో చండీశ్వరస్వామి, జపాలు, పంచావరణార్చనలు, నిత్యవాహనాలు, రుద్రహోమం, మండపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం ప్రదోష కాలపూజలు, హోమాలు, జపానుష్టానాలు జరిపించారు.
Srisailam
అనంతరం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలోస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలో భృంగివాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గ్రామోత్సవం నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు, నందిమండపం నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఉత్సవం కనుల పండువలా సాగింది. భక్తుల శివనామస్మరణలతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. చెంచుకళాకారుల జానపదాలు, కోలాటాలు, హరిదాసులు విన్యాసాలతో సందడిగా ఉత్సవం సాగింది.
హిందూ సాంప్రదాయ సనాతన ధర్మంలో భాగంగా సోమవారం భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఐదు సంవత్సరాలలోపు వయస్సుగల చిన్నారులకు సామూహికంగా భోగిపండ్లు వేయనున్నట్లు చెప్పారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో ఉదయం 10గంటలకు జరిగే కార్యక్రమంలో తమ పేర్లు నమోదు చేసుకున్నవారితో పాటు భక్తుల పిల్లలు కూడా పాల్గొనేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. దాంతో పిల్లలకు
బాలారిష్ట దోషాలు తొలగి, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు.
Srisailam