Srisailam | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీగిరి భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా పలువురు పిల్లలు తల్లిదండ్రుల నుంచి తప్పిపోవడం కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే, బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తప్పిపోయిన పిల్లల ఆచూకీని కనిపెడుతున్నారు. సీసీ కెమెరాల ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చి బుధవారం ఉదయం కూడా ముగ్గురు పిల్లలు తప్పిపోయారు. వారిని సీసీ కెమెరాల రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కనిపెట్టి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన పిల్లలు వివరాలు..
1) నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన ధనాంజనేయులు కుమార్తె పరిమళ (12) శ్రీశైలం ఆలయ పరిసరాల్లో తప్పిపోయింది. సీసీ కెమెరా రూమ్ డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది తప్పిపోయిన పరిమళను కనిపెట్టి ఆమె మేనమామ మల్లయ్యకు అప్పగించారు.
2) కర్నూలు జిల్లా ఆదోని మండలం ముచ్చగిరి గ్రామానికి చెందిన పార్వతి కుమారుడు ప్రదీప్ (3) తప్పిపోగా.. సిబ్బంది అబ్బాయి ఆచూకీని కనుగొని పార్వతికి అప్పగించారు.
3) కర్నూలు రూరల్ దేవమాడకు చెందిన రియాజ్ (8) శ్రీశైలంలోని లడ్డూ కౌంటర్ పరిసర ప్రాంతాల్లో తప్పిపోయాడు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో విధుల్లో ఉన్న సిబ్బంది రియాజ్‌ను కనుగొని అతని తండ్రి రజాక్‌కు అప్పగించారు.
Srisailam1