Srisailam | ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గత ఏడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం దేవస్థానం అధికారులు, దేవస్థానం వైదిక కమిటీ, అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి వరకూ దాదాపు ప్రతి రోజూ గతానికంటే ఎక్కువ మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారన్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజు అత్యధికంగా 1,05,906 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని పేర్కొన్నారు. మహాశివరాత్రి నాడు ఇంత ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి అన్నారు. గతేడాది మహాశివరాత్రి నాడు 1,00,950 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారన్నారు.
అలాగే, బ్రహ్మోత్సవాలలో నాలుగు రోజులు ఉచిత లడ్డూ ప్రసాద వితరణ చేపట్టామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో 10 ఉచిత బస్సులను ఏర్పాటు చేశామని, భక్తులకు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు టెక్నాలజీని వినియోగించుకున్నట్లు తెలిపారు. విధులు నిర్వర్తించిన సిబ్బందికి డిజిటల్ గుర్తింపు కార్డులు అందజేశామని వివరించారు. గతేడాది కంటే ఎక్కువగా వసతులు కల్పించడం వల్ల భక్తులు పెరిగినా ఇబ్బందుల్లేకుండా ఉత్సవాలు సజావుగా నిర్వహించామని చెప్పారు. అందరి సమిష్టి కృషి వల్లే ఉత్సవాలు విజయవంతమయ్యాయన్నారు. గత నెల 19న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత నెల 10న రాష్ట్ర మంత్రుల బృందం, స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం నిర్ణయాల మేరకు భక్తులకు మరిన్ని సదుపాయాలను కల్పించామన్నారు. ఆ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, వీ అనిత, బీ జనార్ధన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవ ఏర్పాట్లను రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిలతో కలిసి స్వయంగా పరిశీలించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాదాపు ఐదు రోజులు శ్రీశైల మహాక్షేత్రం లోనే బస చేసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడంతోపాటు ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు అందించారని చెప్పారు.
రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్, కమీషనర్ కే రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, కర్నూలు రేంజ్ డీఐజీ కే ప్రవీణ్, నంద్యాల జిల్లా ఇంఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ అనునిత్యం భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. దేవదాయశాఖ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర ఆజాద్ ఉత్సవాల నిర్వహణలో పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా విధులకు హాజరయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవస్థానంలోని అన్ని విభాగాల యూనిట్ల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది సజావుగా ఉత్సవాల నిర్వహణకు ఎంతగానో శ్రమించారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించి ఉత్సవాల నిర్వహణలో దేవస్థానం సిబ్బంది ప్రశంసనీయ పాత్రను పోషించారన్నారు.