Srisailam | శ్రీశైలం : ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకుడు ఎం ఉమానాగేశ్వరశాస్త్రిని దేవస్థానం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆలయప్రాంగణంలోని అమ్మవారి ఆశీర్వచన మండపంలో సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమానాగేశ్వరశాస్త్రి 34 సంవత్సరాలు దైవసేవలో తరించారన్నారు. శ్రీశైలక్షేత్రం దివ్యభూమి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను అర్చించే మహాద్భాగ్యం ఆయనకు దక్కిందన్నారు. అనంతరం అర్చకులు, దేవస్థానం అధికారులు ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఉమానాగేశ్వరశాస్త్రి మాట్లాడుతూ ప్రసంగంలో ఎన్నో జన్మల పుణ్యఫలంగా తనకు అమ్మవారిని సేవించే భాగ్యం కలిగిందన్నారు. భక్తులందరినీ శ్రీస్వామిఅమ్మవార్లు సదా రక్షిస్తూ ఉంటారన్నారు. ఉద్యోగ విరమణ ఉమానాగేశ్వరశాస్త్రి దంపతులకు ఈవో స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనాలు చేశారు. ఉమానాగేశ్వరశాస్త్రి 1991లో పరిచారకుడిగా కెరియర్ను ప్రారంభించారు. ఆయన 2003లో సహాయ అర్చకునిగా, 2009లో ముఖ్య అర్చకునిగా, 2017లో ఉపప్రధాన అర్చకునిగా పదోన్నతి పొందారు. 2022లో ప్రధానార్చకునిగా నియాకమయ్యారు. 34 సంవత్సరాలు దైవసేవలో ఉన్న ఆయన.. సెప్టెంబర్ 30న ఉద్యోగ విరమణ చేశారు.