Kurnool Bus Accident | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ( vKaveri ) ట్రావెల్స్ బస్సుకు సీటింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించి, దాన్ని స్లీపర్‌గా మార్చి నడుపుతున్నట్లుగా తెలిసింది.
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసినట్లు తెలిసింది. ప్రమాదానికి గురైన బస్సుకు 2018లో తెలంగాణ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యింది. సీటింగ్ బస్సుగా దానికి రిజిస్ట్రేషన్ జరిగింది. 2023లో ఎన్వోసీతో డయ్యూ డామన్‌లో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడి నుంచి ఆలిండియా పర్మిట్ తీసుకున్నారు. డయ్యూ డామన్ నుంచి బస్సును ఒడిశాలోని రాయగఢకు తీసుకొచ్చి, అక్కడ ఆల్ట్రేషన్, ఫిట్నెస్ చేయించారు.
ఆల్ట్రేషన్ సమయంలో రాయగడ ఆర్టీఏ అధికారులు 43 సీట్ల సీటింగ్ బస్సుకే పర్మిషన్ ఇచ్చారు. కానీ వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ప్రతిచోట ఆర్టీఏ అధికారులతో కుమ్మక్కై అడ్డగోలుగా ఆల్ట్రేషన్ చేసేశారు. 43 సీట్లకు పర్మిషన్ ఉన్న బస్సును స్లీపర్ సర్వీస్‌గా మార్చేశారు. ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నదని తెలుస్తోంది. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వ్యాలిడీ (Fitness Validity) గడువు కూడా గతేడాదే ముగిసినట్లు సమాచారం. అంతేకాదు ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9వ తేదీ వరకు ఈ బస్సు 16సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడం వల్ల, మిగతావి హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్‌లతో చలాన్లు పడినట్లు తెలిసింది. మొత్తంగా రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి.