Srisailam | శ్రీశైలంలో జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు చేపట్టిన ముందస్తు ఏర్పాట్లపై శుక్రవారం దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు పరిశీలించారు. దర్శనం క్యూలైన్లు, శివదీక్షా శిబిరాలు, పార్కింగ్ ప్రదేశాలు, 30 పడకల వైద్యశాల తదితర ప్రాంతాలను సందర్శించారు. క్యూలైన్ల పరిశీలన తర్వాత ఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనం క్యూలైన్ నిర్వహణ ఉండాలని క్యూ కాంప్లెక్స్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎటువంటి అంతరాయం లేకుండా క్యూలైన్లలో నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్ల పంపిణీ చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఏర్పాటు చేయచేసిన వాటర్ పాయింట్లకు నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు.
దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఈఓ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్‌లోని శౌచాలయాల శుభ్రతపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్నీ శౌచాలయాలలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటి సరఫరా అయ్యేలా ఏర్పాటు ఉండాలన్నారు. ఆ తరువాత శివదీక్షా శిబిరాలను సందర్శించారు. శివదీక్షా శిబిరాల పరిశీలనలో భాగంగా పలువురు శివదీక్షాభక్తులతో సంభాషిస్తూ దేవస్థానం ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. పలు పార్కింగ్ ప్రదేశాలను సందర్శించారు. పార్కింగ్ ప్రదేశాలలో తగు విధంగా లైటింగు ఏర్పాట్లు ఉండాలన్నారు.
తదుపరి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 30 పడకల వైద్యశాలను ఈఓ శ్రీనివాసరావు పరిశీలించారు. వైద్యశాల వైద్యులతో ఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్యశాలలో అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా గుండెజబ్బులు, తదితర అత్యవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం హరిదాసు తదితరులు పాల్గొన్నారు.