Tragedy | కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కవ్వాడి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాల గోడ కూలి విద్యార్థి మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీలోని కీర్తి ఇంగ్లీస్ మీడియం స్కూల్లో రాఖీబ్ (5) ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం నాడు అతను స్కూల్కు ఆలస్యంగా వచ్చాడు. రాఖీబ్తో పాటు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను టీచర్ క్లాస్ బయట కాంపౌండ్లో నిల్చోబెట్టారు. ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్ గోడ కూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో రాఖీబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
ప్రైవేటు స్కూల్ గోడకూలి విద్యార్థి మరణించడం పట్ల మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్లలో భద్రతా ప్రమాణాల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి బాలుడి కుటుంబానికి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.