Tirumala | తిరుమలలో మరో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. హరిణి దాటిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు వద్ద గోడను ఢీకొట్టింది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండటంతో బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది. లేదంటే ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న లోయలోకి జారిపడే అవకాశం ఉండేది. కానీ అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పడంతో భక్తులంతా ఊపిరి తీల్చుకున్నారు.
ప్రమాదం కారణంగా ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న సిబ్బంది క్రేన్ సహాయంతో బస్సును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు.
తిరుమలలో ఇవాళ ఉదయమే మరో ప్రమాదం తప్పింది. తిరుమల లడ్డూ ప్రసాదం అందజేసే కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. 47వ నెంబర్ కౌంటర్లో లడ్డూ టోకెన్లు జారీ చేసే కంప్యూటర్‌కు సంబంధించిన యూపీఎస్‌లో ఒక్కససారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.