సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ఒక్కో విధంగా దోచుకుంటున్న వీరు.. మళ్లీ మ్యాట్రీమోనీ వెబ్సైట్లపై పడ్డారు. పెండ్లి సంబంధాల కోసం ఆన్లైన్ పోర్టల్స్ లలో అప్లోడ్ చేసే వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. మాటలు కలిపి.. ఏవో కారణాలు.. సాకులు చెబుతూ.. లక్షలు దోచుకుంటున్నారు. నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్న బాధితులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నుంచి పెండ్లి సంబంధాలకు ప్రయత్నించే వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్‌నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఎక్కువగా నైజీరియన్ సైబర్‌నేరగాళ్లు ఈ మోసాలకు గతంలో పాల్పడేవారు, ఇలాంటి నేరగాళ్లను వరుసగా అరెస్ట్‌లు చేయడంతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మ్యాట్రిమోనీ నేరాలు తిరిగి మొదలయ్యాయి. తాజాగా వరుసగా ఇలాంటి మోసాలు జరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. పెండ్లి సంబంధాల కోసం ఆన్లైన్ పోర్టల్స్‌లో తమ ప్రొఫైల్‌ను అప్లోడ్ చేసే వారిలాగానే సైబర్‌నేరగాళ్లు సైతం తమ నకిలీ ప్రొఫైల్‌తో ఆయా వెబ్సైట్లలోకి ఎంట్రీ అవుతున్నారు.
మ్యాట్రిమోనీ సైట్ల నిర్వాహకులు ప్రొఫైల్స్‌ను సరిగ్గా పరిశీలించకుండానే ఆన్లైన్ ద్వారానే వారి రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేసి ఆయా ప్రొఫైల్స్‌ను అప్లోడ్ చేసేవారు ఉన్నారు. దీంతో ఈజీగా సైబర్‌నేరగాళ్లు ఈ మ్యాట్రిమోనీ సైట్లలో తమ నకిలీ ప్రొఫైల్‌ను అప్లోడ్ చేసి, ఇతర ప్రొఫైల్స్‌ను చూస్తున్నారు. ఇతర ప్రొఫైల్స్‌ను చూసి, అందులో వయస్సు ఎక్కువగా ఉన్న వారిని ఎంచుకుంటున్నారు. వివిధ కారణాలతో వయస్సు పెరుగుతున్నా పెండ్లి కాని వారు ఉంటారు, అలాగే కొందరు రెండో వివాహనికి సిద్ధమైన మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయిస్తుంటారు.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు
వనస్థలిపురానికి చెందిన బాధితురాలు డైవర్స్ మ్యాట్రిమోనీ.కామ్‌లో తమ ప్రొఫైల్‌ను అప్లోడ్ చేయడంతో ఆ ప్రొఫైల్‌ను చూసిన సైబర్‌నేరగాడు తాను పెండ్లికి సిద్ధమని ముందుకు వచ్చాడు. తన మొదటి భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో విడాకులు ఇచ్చానని, తాను కర్నూల్ వాసినని చెప్పుకుంటూ ఎంబీబీఎస్ పూర్తిచేసిన తాను టెక్స్టైల్ అండ్ మెడికల్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించాడు. కర్నూల్ పేరు చెప్పగానే తెలుగోడే కదా అనే నమ్మకం వచ్చింది. కొన్నాళ్లు ఫోన్లో మాట్లాడారు. జాతకాలు చూపిస్తే, ఈ పెండ్లి కాదని చెప్పడంతో పెండ్లి వద్దనుకున్నారు. అయితే సైబర్‌నేరగాడు మాత్రం బాధితురాలికి ఫోన్ చేసి అవన్నీ నమ్మొద్దని, మన వయస్సు 40 సంవత్సరాలు దాటుతుండడంతో ఇప్పుడవన్నీ పట్టించుకోవద్దని సూచనలు చేసి ఆమెతో తిరిగి మాటలు కలిపాడు. ఈక్రమంలోనే తన వ్యాపారానికి అత్యవసరంగా డబ్బులు అవసరమని, తన వ్యాపారం నుంచి మున్ముందు భారీగా డబ్బులు వస్తాయని నమ్మించి దఫ దఫాలుగా బాధితురాలి వద్ద నుంచి రూ. 35 లక్షలు కాజేశాడు.
నేరెడ్‌మెట్‌కు చెందిన బాధితుడికి గత ఏడాది డిసెంబర్లో శ్రీదివ్య పెద్దింటి అనే పేరుతో సైబర్‌నేరగాళ్లు బాధితుడికి వాట్సాప్‌లో కాంటాక్టు అయ్యారు. తాను లండన్‌లో ఉంటున్నానని, నిన్ను పెండ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని నమ్మించింది. కొన్నాళ్లు ఇద్దరు వాట్సాప్‌లో మాట్లాడుకున్నారు. నెల రోజుల తరువాత తాను ఇండియాకు వస్తున్నానని చెప్పింది, రెండు రోజుల తరువాత ఎయిర్‌పోర్టులో తనను పట్టుకున్నారని ఫోన్ చేసింది. తన వద్ద 75 వేల పౌండ్స్‌కు చెందిన డిమాండ్ డ్రాప్,్ట గోల్డ్ జ్యువెలరీ ఉందని, దానిని నిబంధనలకు విరుద్దంగా తెస్తున్నానని ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పెనాల్టీ వేశారని నమ్మించి దఫ దఫాలుగా రూ. 1.5 లక్షలు కొట్టేసింది.
షాది.కామ్(క్రిష్టియన్) మ్యాట్రిమోనీ సైట్లో ఓ ప్రైవేట్ వైద్యురాలు పెండ్లి కోసం తన ప్రొఫైల్‌ను అప్లోడ్ చేసింది. ఈ ప్రొఫైల్‌ను చూసిన విలియం సంగ్మా అమన్ పేరుతో వ్యక్తి ఫోన్ చేసి పెండ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చాడు. తాను బ్రిటన్‌లో ఉంటున్నానని తనకు ఒక కూతురు ఉందంటూ కూతురితో కలిసి ఉన్న ఫొటో, అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆమెకు పంపించాడు. తాను పెండ్లికి సిద్ధమై ఇండియాకు రెండు రోజుల్లో వచ్చేసి నేరుగా కలుసుకుంటానని చెప్పాడు. రెండు రోజుల తరువాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి అనిత అనే పేరుతో ఒక మహిళ ఫోన్ చేసింది. విలియం 155000 బ్రిటన్ పౌండ్స్, మరికొంత బంగారు ఆభరణాలతో ఎలాంటి అనుమతులు లేకుండా పట్టుబడ్డాడరని, మీ పేరు చెబుతున్నాడంటూ చెప్పాడు.
బాధితుడు బాధితురాలికి ఫోన్ చేసి తనను పట్టుకున్నారని, తన వద్ద రూ.కోట్ల విలువైన పౌండ్లు, బంగారం ఉందని, అది సీజ్ చేస్తే మొత్తం పోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో కస్టమ్స్ పేరుతో మాట్లాడిన మహిళ వివిధ ఫీజులు చెల్లించాలని భారీగా డబ్బులు వసూలు చేసింది. ఆ తరువాత విలియం బయటకు వచ్చి ఇప్పటి వరకు పట్టుకున్న వాళ్లంతా నకిలీ అఫీసర్స్ అని, వారి వద్ద నుంచి అన్ని డబ్బులు వసూలు చేయడానికి ఆమెరికాకు చెందిన అడ్వకేట్‌తో ఢిల్లీలో కోర్టుకు వెళ్తున్నానని మరో నాటకానికి తెరలేపాడు. ఇక్కడ కూడా మరికొంత డబ్బును వసూలు చేశాడు. ఇలా దఫ దఫాలుగా బాధితురాలి వద్ద నుంచి రూ. 1.09 కోట్లు సైబర్‌నేరగాళ్లు వసూలు చేశారు.