ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని.. దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు సైతం దాడులు చేసే వారికే సలాం కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడులను ఆపాలని చంద్రబాబు ఏనాడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుడు దారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. అదే చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా మెదిలినా కేసులు పెడుతున్నారని అన్నారు.
మక్కెలు విరగ్గొడతానంటూ ఏకంగా సీఎం చంద్రబాబే మాట్లాడటం దేనికి సంకేతం అని నిలదీశారు. మూడు నెలల్లోనే ఇంతటి దారుణాలు జరిగాయని.. వీటికి ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు దాడులు చేసేందుకు సీఎం చంద్రబాబే లైసెన్సులు ఇచ్చారని మండిపడ్డారు.