అమరావతి : ఏపీలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు( Medical Colleges) వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ నిర్వహించింది. గత రెండు నెలలుగా చేపట్టిన కోటి సంతకాలను అన్ని జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి తరలించే కార్యక్రమాన్ని నిర్వహించింది. సేకరించిన సంతకాలను రాష్ట్ర గవర్నర్‌కు అందించేందుకు ఉద్యమాన్ని నిర్వహించింది.
ఇందులో భాగంగా తిరుపతిలో మాజీ మంత్రులు ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తదితరులు ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని సంతకాల ప్రతులను తరలించే లారీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ విమానాల్లో తిరగడానికే సమయం సరిపోతుందని, ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలను ప్రభుత్వ పరంగా నిర్మాణ పనులను పూర్తి చేయకుండా ప్రైవేట్‌పరం చేసి పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.