Rajampet | అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ డిపో మేనేజర్ సహా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆర్టీసీ పెట్రోల్ బంకులో రూ.62 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అవ్వడంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా, ఇప్పటికే 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజంపేటలోని ఆర్టీసీ డిపో పరిధిలో గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఒక పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అయితే సాంకేతిక లోపాలను ఆసరాగా తీసుకుని సిబ్బంది రూ.62లక్షల నిధులను కాజేశారు. దీనిపై రాయచోటి ఆర్టీసీ డీపీటీవో రాము విచారణ చేపట్టగా నిధులు గోల్మాల్ అయ్యాయని నిర్ధారించారు. దీంతో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ నాగార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెట్రోల్ బంక్ నిర్వహణ అధికారులుగా పనిచేస్తున్న డిపో క్లర్క్ పీఆర్ నాయుడు, అసిస్టెంట్ డిపో క్లర్క్ పీఎల్ నర్సారెడ్డితో పాటు బంక్‌లో పనిచేస్తున్న మరో 27 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అక్రమాలపై విచారణ పూర్తి కావడంతో రాజంపేట డిపో మేనేజర్ సహా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.