Andhra University | ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా వాటిని వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారు. ర్యాగింగ్ అంశం బయటకు రావడంతో స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది.
ఆర్కిటెక్చర్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులతో కొంతమంది సెకండ్ ఇయర్ విద్యార్థినులు దురుసుగా ప్రవర్తించారు. హాస్టల్ రూమ్లో అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అలా చేయలేం.. మాకు డ్యాన్స్ రాదని చెబితే.. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా ర్యాగింగ్ సమయంలో సీనియర్లు వీడియోలు తీసి వాట్సాప్ గ్రూప్ల్లో షేర్ చేశారు. వాటికి మరికొంతమంది సీనియర్లు కామెంట్లు పెట్టారు.
ర్యాగింగ్ విషయాన్ని ప్రొఫెసర్ల దృష్టికి తీసుకెళ్తే సీనియర్లు తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తారేమో అని జూనియర్లు భయపడిపోయారు. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో చివరకు కొంతమంది విద్యార్థినులు మీడియాను ఆశ్రయించడంతో ర్యాగింగ్ విషయం బయటకొచ్చింది. ర్యాగింగ్ అంశం బయటకు రావడంతో కాలేజీ యాజమాన్యం ఘటనపై ఎంక్వైరీ చేయించింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది.