Pensions | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతున్నది. కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇవ్వగా.. ఇప్పుడు వర్ష ప్రభావం పెన్షన్ల పంపిణీపై కూడా పడింది. భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెసులుబాటు కల్పించారు.
భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో వచ్చే ఒకటి, రెండు రోజుల్లో పింఛన్లు పంపిణీ చేయవచ్చని చంద్రబాబు సూచించారు. ఆయా ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, టార్గెట్ పెట్టవద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు కర్నూలు పర్యటన రద్దయ్యింది. ఇవాళ ఓర్వకల్లులో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. కానీ భారీ వర్షాల ప్రభావంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో ఓర్వకల్లులో పింఛన్ల పంపిణీ కూడా వాయిదా పడింది. భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు.
* భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చు
* ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
* పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోంది. వీటిపై దృష్టిపెట్టాలి.
* వర్షాలు, వరదల కారణంగా తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
* కలుషిత ఆహారం ఘటనలకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
* సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశం
* ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దు. ఈ విషయంలో కఠినం గా ఉండాలి.
* వాట్సాప్ గ్రూప్ ల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలి. తద్వారా ప్రజలకు సత్వర సాయం అందుతుంది.
* క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడండి.
* డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలి. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ లు పంపాలి.
* విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తమకు ఆదుకుంటుందనే నమ్మకం వారికి కల్పించేలా అధికారులు, ప్రజా ప్రజాప్రతినిధుల స్పందన ఉండాలి.