రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఓ ప్రైవేటు బస్సు (Travels Bus) బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. కావేలీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్బకు బయల్దేరింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి శివార్లలో ఉన్న కాతేరు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో విశాఖకు చెందిన కోనా మోహన కల్యాణి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మొత్తం 20 మంది గాయపడ్డారని, వారిలో 15 మందికి స్వల్పంగా గాయాలవడంతో ప్రథమ చికిత్స తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లారని చెప్పారు. మిగిలిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారిలో సీహెచ్ కోటేశ్వరరావు, ధనలక్ష్మి, రేణుకలను కాకినాడ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారని, తేజస్విని, దీక్షతలను కిమ్స్ హాస్పిటల్‌కు తరలించామన్నారు. మృతిచెందిన యువతి హైదరాబాద్‌లో పరీక్ష రాయడానికి వెళ్తున్నదని చెప్పారు. డ్రైవరల్ అలసత్వమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్, క్లీనర్ పరారయ్యారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.