అమరావతి : భారత రాజ్యాంగాన్ని (Constitution ) మోదీ కాదుకదా ప్రపంచంలో ఏ శక్తి మార్చలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని టచ్ చేసి చూడండి . ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తుందని హెచ్చరించారు. కడప (Kadapa) లోని బిల్టప్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ఇండియా కూటమి తీసుకుంటుందని అన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తనకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భారతీయుల భవిష్యత్ రాజ్యాంగంపై ఆదారపడి ఉందని వెల్లడించారు.
కాంగ్రెస్, కూటమి ఇచ్చిన మేనిఫెస్టో ద్వారా కోట్లాది మంది ప్రజల జీవన శైలి మార బోతుందని అన్నారు. మోదీ హయాంలో కేవలం అదాని లాంటి 25 మంది మాత్రమే అభివృద్ధి చెందగా దేశం మొత్తం అభివృద్ధి చెందిందని అదాని పత్రికలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల రుణమాపీ, రైతులకు కనీస మద్దతు ధర , 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉపాధి హామీ కూలిని రూ. 250 నుంచి రూ. 400 అందజేస్తామని ప్రకటించారు . ఈ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తదితరులు పాల్గొన్నారు.