YS Jagan | మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవద్దని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. తిరుపతిలో ఎన్డీయే కూటమి నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. చివరకు జగన్ పర్యటనను అడ్డుకోవద్దని కీలక నిర్ణయం తీసుకున్నారు.
జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించినప్పటికీ.. ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీకి జగనే కారణమని ఈ నిరసన చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఒకవేళ వైసీపీ రాజకీయ బల ప్రదర్శనకు దిగితే మాత్రం దీటుగా సమాధానం చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు.
వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగన్ను అడ్డుకుంటామన్న హెచ్చరికలతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జగన్ తిరుమలకు వస్తుండటంతో వైసీపీ, కూటమి నేతలకు ముందస్తుగా నోటీసులు జారీచేస్తున్నారు. కడప, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వదిలిపెడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.తిరుమల పర్యటనలో జగన్కు వెయ్యి మంది పోలీసులకు భద్రతను పటిష్టం చేశారు. ఇక తిరుమలలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కొనసాగుతున్నది. అక్టోబర్ 24వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడానికి కుదరదు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.
ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4.50 గంటలకు వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు తిరుమలకు బయల్దేరతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే గెస్ట్ హౌస్లో బస చేసి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి వెళ్లి.. శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11.30 గంటలకు ఆలయం నుంచి గెస్ట్ హౌస్కు బయల్దేరతారు. 11.50 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. 1.30 గంటలకు రేణిగుంట నుంచి బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారు.