విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (Vizag MLC Election) టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూరంగా ఉండనుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. విశాఖ జిల్లా నేతలతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉపఎన్నికల్లో పోటీచేయాలా లేదా అనే విషయంపై కూటమి పార్టీలు తర్జనభర్జన పడ్డాయి. సరైన బలం లేకపోవడంతో చివరికి పోటీ నుంచి తప్పుకున్నాయి. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీలో ఉన్నారు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. సోమవారం బోత్స తన నామినేషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఇప్పటికే టీడీపీ పోటీ నుంచి తప్పుకున్నది. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా తన నామినేషన్ను ఉపసంహరించుకుంటే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అలాకాకుండా ఇండిపెండెంట్ తన నామినేషన్ను ఉపసంహరించుకోకపోయినా ఆయన విజయం లాంఛనమే కానున్నది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 840 ఓట్లు ఉన్నాయి. వాటిలో 11 ఖాళీలు ఉనాయి. ఇక మిగిలినవాటిలో విపక్ష వైసీపీకి 615 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, టీడీపీకి 214 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇరు పార్టీల మధ్య 400 మంది వ్యత్యాసం ఉన్నది. ఈ నేపథ్యంలో బొత్స గెలుపు సులభం కానుంది.